India: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు దిమ్మదిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన భారత్

  • మానవ హక్కుల కమిషన్ లో 58 దేశాల మద్దతు తమకేనన్న ఇమ్రాన్
  • ఉన్నదే 47 దేశాలంటూ బదులిచ్చిన భారత విదేశాంగ శాఖ
  • ఆ 58 దేశాల జాబితా ఇవ్వాలంటూ పాక్ ను డిమాండ్ చేసిన రవీష్ కుమార్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవగాహన రాహిత్యం, విషయలేమి మరోసారి బయటపడింది. ఆర్టికల్ 370 రద్దుపై రగిలిపోతున్న పాకిస్థాన్ కు అంతర్జాతీయ వేదికలపై పలు ఎదురుదెబ్బలు తగిలినా తమదే పైచేయి అంటోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో తమకు 58 దేశాలు మద్దతు పలికాయని ఇమ్రాన్ ఖాన్ గొప్పగా చెప్పుకోవడం తెలిసిందే. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ అదిరిపోయే జవాబు ఇచ్చింది.

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ దీనిపై స్పందిస్తూ,  ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ లో ఉన్నదే 47 సభ్య దేశాలని, పాక్ కు మద్దతు ఇస్తున్న దేశాలు ఏవో తమకు తెలియడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. అంతేకాకుండా, వీలైతే ఆ 58 దేశాల జాబితా ఇవ్వాలంటూ పాకిస్థాన్ కు చురక అంటించారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశం వివరాలు అందరికీ తెలుసని, కానీ పాకిస్థాన్ తక్కిన ప్రపంచానికి కొత్త విషయాలు చెబుతోందని విమర్శించారు. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడుస్తోంది.

More Telugu News