Andhra Pradesh: ఇప్పట్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోం.. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటన!

  • ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు
  • స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దృష్టి సారిస్తాం
  • అమరావతిలో మీడియాతో వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేస్తామని ఆయన చెప్పారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని చంద్రబోస్ అమరావతిలో మీడియాకు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 17 నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఏపీలో భూముల రీసర్వే కోసం రూ.1800 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని పేర్కొన్నారు.

డెన్మార్క్ దేశంలో జరిగిన భూసర్వేను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఏపీలో దాదాపు 25 లక్షల ఇళ్లను పేదలకు నిర్మించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించనున్నారు.

More Telugu News