Jagan: బందరు పోర్టు విషయంలో మా నుంచి ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదు: హైకోర్టులో ‘నవయుగ’ వాదన

  • జీవో నంబరు 66పై కోర్టును ఆశ్రయించిన నవయుగ
  • తమకు భూమిని అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందని వాదన
  • ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే మూడు దశలను అనుసరించాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నవయుగ ఇంజినీరింగ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. బందరు పోర్టు ఒప్పంద పనులను ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ కోరకుండా ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించింది. గురువారం ఆ సంస్థ తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది విల్సన్ తన వాదనలు వినిపిస్తూ అడ్డంకులు అధిగమించి 5,324 ఎకరాల భూమిని తమకు అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

తమకు అప్పగించిన 412 ఎకరాల్లో దారి కానీ, కనీస సౌకర్యాలు కానీ కల్పించలేదని ఆరోపించారు. ప్రభుత్వం తన సొంత తప్పిదాన్ని తమపై మోపుతోందన్నారు. తమవైపు నుంచి ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని, పేర్కొన్నారు. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే మూడు దశలను అనుసరించాల్సి ఉండగా, తొలి దశలోనే రద్దు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 66 అమలును నిలిపివేయాలని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ పనులను వేరొకిరికి అప్పగించకుండా చూడాలని అభ్యర్థించారు.

నవయుగ సంస్థ ఆరోపణలను ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరాం ఖండించారు. నవయుగ సంస్థ డీపీఆర్‌పై చూపించిన శ్రద్ధను ప్రాజెక్టు నిర్మాణంపై చూపించలేదన్నారు. ఒప్పందం రద్దు విషయంలో ఎటువంటి దురుద్దేశాలు లేవని, ఎందుకు రద్దు చేస్తున్నామో జీవోలో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్ అనుబంధ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.

More Telugu News