Andhra Pradesh: చాలామంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు!: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

  • సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
  • ప్రజలు ఫోన్ చేస్తే అధికారులు స్పందించట్లేదు
  • విజయవాడలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పలు ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రవేశపెట్టారనీ, వీటి ఫలాలు ప్రజలకు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఏపీ మున్సిల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. విజయవాడలో ఈరోజు జరిగిన మున్సిపల్ కమిషనర్ల వర్క్ షాప్ లో సత్తిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఫోన్ చేస్తే చాలామంది అధికారులు అసలు కాల్ లిఫ్ట్ చేయడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమం విషయంలో అధికారులు ఎంతమాత్రం రాజీ పడేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనీ, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణపై దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. వచ్చే ఉగాది నాటికి ఇళ్లు లేని పేదలకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారనీ, అందుకు అనుగుణంగా మున్సిపల్ కమిషనర్లు గ్రామ వాలంటీర్లు, సచివాలయం అధికారుల సేవలను వినియోగించుకోవాలని బొత్స చెప్పారు. చాలామంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని అడుగుతున్నారనీ, ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు.

More Telugu News