Andhra Pradesh: మేం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరా?: మున్సిపల్ కమిషనర్లపై ఏపీ మంత్రి బొత్స ఆగ్రహం

  • ప్రభుత్వ సొమ్ముతో ఫోన్లు కొంటున్నారని వ్యాఖ్య
  • తమ కాల్స్ కు స్పందించడం లేదని ఆగ్రహం
  • విజయవాడలో మీడియాతో ఏపీ మున్సిపల్ మంత్రి

వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం కింద అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు కేటాయిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏపీలో ఎన్నడూ లేనట్లు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. 100 రోజుల వైసీపీ పాలనలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రక్షాళన చేశామని బొత్స చెప్పారు. విజయవాడలో ఈరోజు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు దృష్టి సారించాలనీ, తగిన చర్యలు తీసుకోవాలని బొత్స సూచించారు. ఈ సందర్భంగా  కొందరు మున్సిపల్ కమిషనర్లపై పై బొత్స కన్నెర్ర చేశారు. ‘ప్రభుత్వ ధనంతో ఫోన్లు కొంటున్నారు. బిల్లులు కట్టుకుంటున్నారు.

కానీ మా ఫోన్లకు స్పందించకపోవడం కమిషనర్లకు కరెక్ట్ కాదు’ అని హెచ్చరించారు. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జలశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నమాట వాస్తవమేననీ, అయినా ఓ ప్రణాళికతో తాము ముందుకెళుతున్నామని చెప్పారు.

More Telugu News