Andhra Pradesh: పల్నాడులో ఫ్యాక్షన్ బుసలు.. వైసీపీ కార్యకర్తను నరికి చంపిన ప్రత్యర్థులు!

  • నరసరావుపేటలోని అల్లూరివారిపాలెంలో ఘటన
  • కోనూరి హరికిరణ్ ను నరికి చంపిన ప్రత్యర్థులు
  • టీడీపీ నేతలే చంపారని పోలీసులకు సోదరి ఫిర్యాదు

పల్నాడులో ఫ్యాక్షన్ రక్కసి బుసలు కొట్టింది. ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో చోటుచేసుకుంది. పల్నాడులోని నరసరావుపేట మండలం అల్లూరివారి పాలెంలో కొందరు దుండగులు వైసీపీ కార్యకర్త కోనూరి హరికిరణ్ చౌదరి(36)ని దారుణంగా హత్యచేశారు. నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయం 9 గంటల సమయంలో హరికిరణ్ ఊరిలోని రామాలయం సెంటర్ వద్ద ఉండగా, కొందరు వ్యక్తులు అక్కడకు చేరుకుని బాధితుడిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యారు.

ఈ సందర్భంగా హరికిరణ్ రక్తపు మడుగులో పడిపోగా, కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, తెలుగుదేశం నేతలే హరికిరణ్ ను చంపించారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని ఇక్కుర్రు గ్రామానికి చెందిన టీడీపీ నేత బొడ్డపాటి పేరయ్యకు, హరికిరణ్ కు మధ్య విభేదాలు ఉన్నాయి. అల్లూరివారి పాలెంకు చెందిన పేరయ్య వియ్యంకుడు ఉడతా పుల్లయ్య 2013లో హత్యకు గురయ్యారు.

ఈ కేసులో హరికిరణ్ తో పాటు శ్రీనివాసరావు అనే వ్యక్తి నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఫ్యాక్షన్ హత్య చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన అన్న హరికిరణ్ ను బొడ్డపాటి పేరయ్య, కొల్లి వెంకటేశ్వర్లు, కనుమూరి రమేష్, అల్లూరివారి పాలేనికి చెందిన ఉడతా రాఘవ, చెరుకూరి సాంబశివరావు, ఉడతా వెంకయ్యచౌదరి హత్య చేశారని ఫిర్యాదు చేశారు. మరోవైపు మృతుడి కుటుంబాన్ని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు.

More Telugu News