Telangana: డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన మందుబాబుపై భారీ ఫైన్!

  • నకిరేకల్ లో పట్టుబడ్డ మందుబాబు
  • రూ. 10 వేలు ఫైన్ వేసిన న్యాయమూర్తి
  • కట్టకుంటే 15 రోజుల జైలు శిక్ష

కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలంగాణలో ఇంకా అమలులోకి రాకపోయినప్పటికీ, మందు కొట్టి బండి నడుపుతున్న ఓ యువకుడికి కోర్టు భారీ జరిమానా విధించడం విశేషం. గతంలో డ్రంకెన్ డ్రైవ్ పై రూ. 2 వేల జరిమానా ఉండగా, రూ. 10 వేలు జరిమానాను కోర్టు విధించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో చోటు చేసుకుంది.

ఇటీవల పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఓ మందుబాబు దొరికిపోయాడు. అతన్ని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, తొలి నేరంగా పరిగణిస్తూ, పది వేలు జరిమానా చెల్లించాలని, లేకుంటే 15 రోజుల జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పిచ్చారు. తెలంగాణలో డ్రంకెన్ డ్రైవ్ పై భారీ ఫైన్ విధించడం ఇదే తొలిసారి.

దీనిపై వివరణ ఇచ్చిన నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వెళ్తామని, ఇతర నిబంధనల ఉల్లంఘనల్లో మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే జీవోను అనుసరించి జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు. మైనర్ డ్రైవింగ్, నో హెల్మెట్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడింగ్ తదితర ఉల్లంఘనలపై విధించాల్సిన చలాన్లపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు.

More Telugu News