పాకిస్థాన్ భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఆయుధాలతో వస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు!

12-09-2019 Thu 12:05
  • జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో ఘటన
  • పంజాబ్ నుంచి వస్తున్న ట్రక్కులో భారీగా ఆయుధాలు
  • ఆరు ఏకే-47లు, భారీగా గ్రనేడ్ లాంఛర్లు, బుల్లెట్లు స్వాధీనం
భారత్ లో ఉగ్రదాడులకు పాక్ పన్నిన భారీ కుట్రను భద్రతాబలగాలు భగ్నం చేశాయి. ఉగ్రమూకలకు అందించేందుకు ఓ లారీ నిండా తీసుకెళుతున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటన జమ్మూలోని కథువా జిల్లాలో చోటుచేసుకుంది. పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి ఓ ట్రక్కు కశ్మీర్ కు బయలుదేరింది. అయితే ఈ ట్రక్కులో ఆయుధాలను రహస్యంగా తరలిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఈ ట్రక్కును కథువా జిల్లాలోని లఖన్ పూర్ వద్ద చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ట్రక్కును పరిశీలించగా, ఆరు ఏకే-47 తుపాకులు, గ్రనేడ్ లాంఛర్లు, పలు ఇతర ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆయుధాలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ ట్రక్కు కశ్మీర్ నంబర్ ప్లేట్ తో ఉందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

అసలు ఆయుధాలు దేశంలోకి ఎలా వస్తున్నాయి? అంతర్జాతీయ సరిహద్దు గుండా పాక్ ఉగ్రసంస్థల అధినేతలు భారత్ లోకి ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్నారా? ఖలిస్థాన్ తీవ్రవాదులు-పాక్ ఉగ్రవాదులు పరస్పర సహకారంతో ఆయుధాల స్మగ్లింగ్ చేపడుతున్నారా? అనే కోణంలో భారత బలగాలు, పోలీసులు విచారణ జరుపుతున్నారు.

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం గత నెల 5న రద్దు చేసింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని లడఖ్, జమ్మూకశ్మీర్ లుగా కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో అక్కడ హింసను రెచ్చగొట్టేందుకు పాక్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.