terrorists: కోస్తా తీరంలో హై అలర్ట్‌.. ఉగ్ర ముప్పు హెచ్చరికలతో అప్రమత్తం

  • ఐబీ హెచ్చరికలతో గస్తీ ముమ్మరం చేసిన మెరైన్‌ పోలీసులు
  • కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని ఆదేశం
  • దక్షిణాదిలో విధ్వంసానికి ముష్కరుల కుట్ర

ముష్కర మూకలు సముద్ర మార్గం ద్వారా ఏపీ భూభాగంలోకి ప్రవేశించి ఏ క్షణమైనా విధ్వంసానికి తెగబడేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కోస్తా తీరంలో హై అలర్ట్‌ ప్రకటించి జల్లెడ పడుతున్నారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుచేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీసినప్పటి నుంచి పాకిస్థాన్‌ భారత్‌పై మండిపోతోంది. దీంతో ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదోలా భారత్‌లోకి ప్రవేశించి విధ్వంసాలకు తెగబడే ప్రయత్నాలు అప్పటి నుంచే చేస్తున్నారు. అయితే కేంద్ర బలగాలు పటిష్ట చర్యలు చేపట్టడంతో వీలుచిక్కని పరిస్థితుల్లో ముష్కర మూకలు దక్షిణ భారత దేశంపై దృష్టిసారించినట్లు సమాచారం.

ఇందులో భాగంగా సముద్రం గుండా ఏపీ భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలకు ఉప్పందింది. దీంతో ఐబీ హెచ్చరికలతో రాష్ట్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మెరైన్‌ పోలీసులు తీరంలో గస్తీ ముమ్మరం చేశారు. కొత్త వ్యక్తులు ఎవరు తారసపడినా సమాచారం ఇవ్వాలని మత్స్యకారులకు, తీరప్రాంత వాసులకు సమాచారం అందించారు. ఉగ్రమూకలు తిరుమల చేరాయన్న సమాచారంతో అక్కడ ఆక్టోపస్‌ దళాలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

More Telugu News