నిమజ్జనం వేళ.. ప్రతి నాలుగున్నర నిమిషాలకో మెట్రో రైలు

12-09-2019 Thu 09:08
  • నేటి అర్ధరాత్రి వరకు తిరగనున్న రైళ్లు
  • నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం వేళల పొడిగింపు
  • వెల్లడించిన మెట్రో రైల్ ఎండీ
నేడు వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ప్రతీ నాలుగున్నర నిమిషాలకో రైలును నడుపుతున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

సాధారణంగా మియాపూర్, ఎల్బీనగర్ నుంచి రాత్రి పదిన్నర గంటలకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరుతాయని, కానీ నేడు భక్తుల రద్దీ సౌకర్యార్థం అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఖైరతాబాద్ వరకు మెట్రోలో సులభంగా చేరుకునే అవకాశం ఉండడంతో రైలు సమయాన్ని పొడిగించినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.