Chintamaneni: వస్తున్నా... అరెస్ట్ చేసుకోండి: చింతమనేని ప్రభాకర్

  • చింతమనేనిపై నమోదైన అట్రాసిటీ కేసు
  • మూడు వారాలుగా అజ్ఞాతంలో మాజీ ఎమ్మెల్యే
  • నేడు ఎస్పీ ఆఫీస్ కు వస్తున్నట్టు వెల్లడి

తాను ఈ రోజు ఎస్పీ ఆఫీసు వద్దకు వస్తున్నానని, తనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పినకిడిమిలో అట్రాసిటీ కేసు నమోదు కావడంతో, గత మూడు వారాలుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని, మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందువల్లే భయపడటం లేదని అన్నారు.

ఎస్పీ ఆఫీస్ కు తానే స్వయంగా వెళుతున్నానని చెప్పారు. నేడు హైకోర్టులో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ ఉందని గుర్తు చేసిన చింతమనేని, విచారణ ప్రారంభమయ్యే సమయానికన్నా ముందుగానే తాను పోలీసుల ముందు ఉంటానని అన్నారు. తనను అరెస్ట్ చేసుకునేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని, తనపై కేసు నమోదైన పినకిడిమి గ్రామానికి వెళ్లి, నాడు ఏం జరిగిందో గ్రామసభ పెట్టి మరీ విచారించుకోవచ్చని అన్నారు. తాను తప్పు చేసినట్టు రుజువు అయితే, తనకున్న ఆస్తి మొత్తాన్ని రాసిస్తానని, ఈ వ్యవహారంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు తప్పని తేలితే, మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని చింతమనేని ప్రశ్నించారు.

తనపై కేసు పెట్టారని తెలిసిన తరువాతనే కోర్టుకు వెళ్లానని, పార్టీ నేత చెప్పారన్న కారణంతోనే ఆర్టీసీ డ్రైవర్ కు క్షమాపణలు కూడా చెప్పానని ఆయన అన్నారు. గడచిన మూడున్నర నెలల వ్యవధిలో తాను ఎన్నడూ ఇల్లుదాటి బయటకు రాలేదని, తనపై అభియోగాలు రుజువైతే ఏమైనా చేసుకోవచ్చని అన్నారు. కాగా, ఈ ఉదయం దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన అక్కడ లేకపోవడంతో, డీఎస్పీ దిలీప్ కిరణ్ నేతృత్వంలోని టీమ్, ఇంట్లో సోదాలు నిర్వహించింది.

More Telugu News