Afghanistan: అపూర్వ విజయంతో టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆఫ్ఘన్ యోధుడు

  • టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన నబీ
  • పరిమిత ఓవర్ల క్రికెట్ కు పరిమితం అంటూ వెల్లడి
  • ఆఫ్ఘన్ జట్టుకు విశేష సేవలందించిన నబీ

ఒకప్పుడు పసికూనగా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్ ఇప్పుడు పెద్ద జట్లకు సైతం సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలోనూ గణనీయ స్థాయిలో విజయాలు సాధిస్తూ క్రమంగా తన ర్యాంకు మెరుగుపర్చుకుంటోంది. ఆఫ్ఘన్ విజయప్రస్థానంలో సీనియర్ ఆటగాళ్ల పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా, మహ్మద్ నబీ అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ రాణిస్తూ జట్టుకు విశేష సేవలందించాడు. దురదృష్టవశాత్తు కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడిన నబీ ఐదు రోజుల ఫార్మాట్ కు రిటైర్మెంటు ప్రకటించాడు. తమ స్టార్ ఆల్ రౌండర్ కు చివరి టెస్టులో ఆఫ్ఘన్లు అద్భుత విజయంతో సెండాఫ్ ఇచ్చారు.

బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు 224 పరుగుల తేడాతో అపూర్వ విజయం సాధించింది. నబీకి ఈ మ్యాచే చివరి టెస్టు మ్యాచ్. ఇకపై ఈ స్పిన్ ఆల్ రౌండర్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొనసాగుతాడు. నబీ వయస్సు 34 ఏళ్లు. నబీ తన కెరీర్లో 3 టెస్టులాడి 33 పరుగులు చేసి, 8 వికెట్లు సాధించాడు. 121 వన్డేలాడి 2699 పరుగులు చేశాడు. వాటిలో ఓ సెంచరీ, 14 అర్ధసెంచరీలున్నాయి. 68 టి20 మ్యాచ్ లలో 145.12 స్ట్రయిక్ రేటుతో 1161 పరుగులు నమోదు చేశాడు. వన్డేల్లో 128 వికెట్లు తీసిన నబీ, టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. నబీ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడన్న సంగతి తెలిసిందే.

More Telugu News