Afghanistan: అటు బ్యాటుతో, ఇటు బంతితో... ఆఫ్ఘనిస్థాన్ కు చిరస్మరణీయ విజయం అందించిన రషీద్ ఖాన్

  • పిన్న వయసులోనే టెస్టు కెప్టెన్సీ అందుకున్న రషీద్ ఖాన్
  • బంగ్లాదేశ్ పై విశ్వరూపం.. 11 వికెట్లు.. అర్థసెంచరీ
  • అత్యంత చిన్నవయసులో టెస్టు నెగ్గిన కెప్టెన్ గా రికార్డు

రషీద్ ఖాన్... ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఈ యువకిశోరం ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు రషీద్ ఖాన్ సేవలు వెలకట్టలేనివి. తాజాగా, 20 ఏళ్ల వయసులోనే ఆఫ్ఘనిస్థాన్ టెస్టు జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఈ ఆల్ రౌండర్ బంగ్లాదేశ్ తో టెస్టులో తన విశ్వరూపం ప్రదర్శించాడు. రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు 224 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్ ను చిత్తుచేసింది. తద్వారా అత్యంత పిన్నవయసులో టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్ గా రషీద్ ఖాన్ రికార్డు నమోదు చేశాడు.

చట్టోగ్రామ్ లోని జహూర్ అహ్మద్ స్టేడియంలో జరిగిన ఈ టెస్టు మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు తనకంటే ఎంతో అనుభవం ఉన్న బంగ్లాదేశ్ జట్టును మట్టి కరిపించింది. కెప్టెన్ రషీద్ ఖాన్ తొలి ఇన్నింగ్స్ లో అర్ధసెంచరీతో జట్టుకు విలువైన పరుగులు అందించడమే కాదు, రెండు ఇన్నింగగ్సుల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన రషీద్ ఖాన్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను కుప్పకూల్చాడు. రషీద్ ధాటికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 173 పరుగులకే ఆలౌటైంది.

More Telugu News