Andhra Pradesh: ఇది అమరావతిని ఆపడానికి ఏపీ సీఎం జగన్ పన్నిన కుట్రే!: నారా లోకేశ్ ఆగ్రహం

  • ప్రపంచబ్యాంక్ సాయంపై కేంద్రం లేఖలు రాసింది
  • అయినా జగన్ సర్కారు స్పందించలేదు
  • ప్రజల మనోభావాలంటే ఆయనకు లెక్కలేదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం విషయంలో కేంద్రం రాష్ట్రానికి ఎన్నో లేఖలు రాసిందని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. నెల రోజుల పాటు లేఖలు రాసిన కేంద్ర ప్రభుత్వం ‘ప్రపంచ బ్యాంకుకు మీ వైఖరి చెప్పండి’ అని ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించిందని వెల్లడించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అస్సలు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రుల మనోభావాలంటే ఏపీ సీఎం జగన్ గారికి అంత లెక్కలేనితనంగా మారిపోయాయని విమర్శించారు.

ఈ చర్య అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే మరేంటని ప్రశ్నించారు. అసలు ప్రజలు కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కును ఏపీ ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ‘వందల కోట్లతో సొంత ఇంటిని కట్టుకున్న మీరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుతమైన రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారు?’ అని ఏపీ సీఎంను సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన నారా లోకేశ్ ఓ పత్రిక కథనాన్ని తన ట్వీట్ కు జతచేశారు.

More Telugu News