chandrayaan-2: భారత శాస్త్రవేత్తలకు పదేళ్ల బాలుడి లేఖ... వైరల్!

  • చంద్రయాన్-2 విఫలమైనా ఇస్రోకు ప్రశంసలు
  • చంద్రయాన్-3 లక్ష్యంగా ముందుకు సాగండి
  • ఆర్బిటర్ పంపే చిత్రాలు కూడా కీలకమేనన్న బాలుడు

చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైనా, భారత శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఇస్రో కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ప్రయోగం విఫలమైన తరువాత ఇస్రో చైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకోగా, ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను హత్తుకుని, స్థైర్యాన్ని కోల్పోవద్దని ఓదార్చారు. ఇక, పదేళ్ల బాలుడు ఆంజనేయ కౌల్‌, ఇస్రో సైంటిస్తులను ఉద్దేశిస్తూ, ఓ లేఖ రాయగా, అదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తన లేఖలో ఆ బాలుడు శాస్త్రవేత్తలకు ధైర్యాన్ని చెప్పాడు. ఇండియా తప్పకుండా చంద్రుడిని చేరుతుందన్న నమ్మకం ఉందన్నారు. వచ్చే సంవత్సరం జూన్ లో చేపట్టే 'చంద్రయాన్‌-3' లక్ష్యంగా సాగాలని సూచించాడు. ఆర్బిటర్‌ ఇంకా చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతోందని, అది పంపే ఫోటోలు కూడా కీలకమేనని అన్నాడు. భవిష్యత్తులో వ్యోమగాములు ఎక్కడ దిగాలన్న విషయాన్ని అదే చెబుతుందని, ఎక్కడ విత్తనాలను నాటాలో మనకు ముందుగానే తెలుస్తుందని అన్నాడు.

విక్రమ్‌ తప్పకుండా ల్యాండ్ అయ్యే ఉంటుందని, ప్రజ్ఞాన్‌ కూడా పని చేస్తూనే ఉందని అనుకుంటున్నానని, అది గ్రాఫికల్‌ బ్యాండ్స్‌ ను భూమిపైకి పంపించేందుకు సిద్ధమవుతూ ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. తన వంటి తదుపరి తరం పిల్లలకు శాస్త్రజ్ఞులే స్ఫూర్తిదాయకమన్నాడు.

More Telugu News