Fire Accident: విశాఖ పోర్టులో మళ్లీ అగ్నిప్రమాదం...పక్షం రోజుల్లో రెండోది

  • ఈస్ట్‌ క్యూ 7 నంబర్‌ బెర్త్‌ క్రేన్‌లో మంటలు
  • పూర్తిగా దగ్ధమైన పరికరం
  • గత నెల 26వ తేదీన ఇదే ప్రాంతంలో భారీ ప్రమాదం

విశాఖ పోర్టులో మళ్లీ అగ్నిప్రమాదం జరిగింది. ఇన్నర్‌ హార్బర్‌లోని ఈస్ట్‌ క్యూ 7 నంబర్‌ బెర్త్‌ క్రేన్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. పదిహేను రోజుల వ్యవధిలో వరుసగా రెండు ప్రమాదాలు దాదాపు ఒకేచోట జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కార్మికులంతా పనుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

గత నెల 26వ తేదీన పోర్టులోని హార్బర్‌ మొబైల్‌ క్రేన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ రోజు సాయంత్రం ఇన్నర్‌ హార్బర్‌లోని డబ్ల్యూక్యూ-1 బెర్త్‌లో ఎంవీ యాస ఫల్కాన్‌లో ఐరన్‌ ఓర్‌ లోడ్‌ చేస్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి క్రేన్‌ ఆపరేటర్‌ తప్పించుకోగా, క్రేన్‌ మాత్రం పూర్తిగా దగ్ధమైంది.

గత నెలలోనే అవుటర్‌ హార్బర్‌లోనూ భారీ ప్రమాదం జరిగింది. కోస్టల్ జాగ్వార్ అనే ఆఫ్ షోర్ సపోర్ట్ వెహికిల్ లో మంటలు చెలరేగడంతో ఒకరు చనిపోగా 13 మంది గాయపడ్డారు. ప్రమాద సమయానికి 29 మంది షిప్ లో ఉండగా వారంతా సముద్రంలోకి దూకేసి తప్పించుకున్నారు.

More Telugu News