BJP: ఈ ఏడాది 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • మోదీ 100 రోజుల పాలనలో కీలక నిర్ణయాలు
  • దేశాన్ని వేధిస్తున్న సమస్యలను మోదీ పరిష్కరించారు
  • గుంటూరులో మీడియాతో కేంద్ర మంత్రి 

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత్ సమైక్యత దిశగా మోదీ పలు నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. గుంటూరులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు మోదీ కృషి చేశారని ప్రశంసించారు.

అలాగే సంస్కరణల్లో వేగం పెరిగిందనీ, ప్రతీఒక్కరి సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నామని చెప్పారు.  మోదీ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ అదనంగా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాదిలో 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడనుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చాక 3 నెలల్లోనే 30 బిల్లులను ఆమోదించామనీ, ఇది ఓ చరిత్రని వ్యాఖ్యానించారు. ఒకే దేశం-ఒకే పవర్ గ్రిడ్ విధానంతో ముందుకెళుతున్నామని చెప్పారు.

More Telugu News