Hyderabad: ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ రికార్డు.. నిన్న 70 వేల మంది రాకపోకలు

  • గణపతి దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులతో కిక్కిరిసిన స్టేషన్
  • 40 వేల మంది దిగి.. 30 వేల మంది ఎక్కిన వైనం
  • రద్దీ తట్టుకునేందుకు అదనపు రైళ్లు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నిన్న రికార్డు సృష్టించింది. ఖైరతాబాద్ భారీ గణపతిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. మొత్తంగా 70 వేల మంది రాకపోకలు సాగించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 40 వేల మంది దిగగా, 30 వేల మంది ఎక్కినట్టు తెలిపారు.

మెట్రో సేవలు ప్రారంభమైన తర్వాత ఒక స్టేషన్ నుంచి ఒక రోజులో ఇంతమంది ప్రయాణించడం ఇదే తొలిసారి. కాగా, భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రతీ నాలుగున్నర నిమిషాలకు ఓ రైలును అందుబాటులో ఉంచడంతోపాటు అదనపు రైళ్లను కూడా నడపాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. అలాగే రాత్రి వేళ మరో అరగంట పాటు సేవలను పొడిగించారు. ఖైరతాబాద్ నుంచి అన్ని వైపులకు రాత్రి 11:30 గంటలకు చివరి మెట్రో రైలును నడిపినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

More Telugu News