కరేబియన్ లీగ్ సెగ.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన క్రికెటర్ దినేశ్ కార్తీక్!

08-09-2019 Sun 15:29
  • సీపీఎల్ కు హాజరైన షారుక్, కార్తీక్
  • ట్రిన్ బాగో జెర్సీ ధరించిన క్రికెటర్
  • షోకాజ్ నోటీసులు జారీచేసిన బీసీసీఐ
భారత క్రికెట్ జట్టు ఆటగాడు దినేశ్ కార్తీక్ బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు. టీమిండియా జట్టు కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించాడని బీసీసీఐ కన్నెర్ర చేయడంతో కార్తీక్ ఈ మేరకు స్పందించాడు. అసలు ఇంతకూ ఏం జరిగిందంటే ఇటీవల కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)కు ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తో కలిసి దినేశ్ కార్తీక్ హాజరయ్యారు. అక్కడే ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జెర్సీ ధరించి ఆ జట్టు డ్రెస్సింగ్  రూమ్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించాడు. ఐపీఎల్ లో షారుక్ ఖాన్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు దినేశ్ కార్తీక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ చొరవతోనే దినేశ్ కార్తీక్ ఈ మ్యాచ్ కు హాజరయ్యాడు. అయితే భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ నిబంధనలకు ఇది వ్యతిరేకం కావడంతో బోర్డు పెద్దలు కన్నెర్ర జేశారు. కార్తీక్ చర్య బీసీసీఐ కాంట్రాక్టును ఉల్లంఘించడమేననీ, కాబట్టి ఒప్పందాన్ని ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీచేశారు. దీంతో దినేశ్ కార్తీక్ తన చర్య పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ కు హాజరై, మరో జట్టు జెర్సీ ధరించడంపై క్షమాపణలు కోరారు. కాగా, ఈ వ్యవహారంలో బీసీసీఐ పెద్దలు ఇంతవరకూ స్పందించలేదు.  కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టును షారుక్ ఖాన్ కొనుగోలు చేశారు.