Guntur District: జ్యూస్ ఇచ్చి వృద్ధురాలి నుంచి ఆరు సవర్ల బంగారం చోరీ

  • పింఛన్ డబ్బుల కోసం ఒంగోలు వెళ్లిన వేలటూరుకు చెందిన వృద్ధురాలు
  • తిరుగు ప్రయాణంలో చోరీకి గురైన వైనం
  • పండ్ల రసం ఇచ్చి బంగారం, డబ్బుతో మాయమైన యువతి

వృద్ధురాలికి పండ్ల రసం ఇచ్చి ఆమె నిద్రలోకి జారుకున్నాక ఆమె నుంచి ఆరు సవర్ల బంగారు నగలు చోరీ చేసిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. వినుకొండ సమీపంలోని వేలటూరుకు చెందిన డి.చినజింగిరమ్మ పింఛన్ సొమ్ము కోసం ఇటీవల ఒంగోలు వెళ్లింది. ఈ నెల ఐదో తేదీన ఆమె తిరిగి వేలటూరు పయనమైంది. ఒంగోలు బస్టాండ్‌లో కుమారులు ఆమెను నరసరావుపేట బస్సు ఎక్కించారు.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం అడ్డరోడ్డులో దిగిన వృద్ధురాలు అక్కడ వినుకొండ వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఈ క్రమంలో ఆటోలో అప్పటికే ఉన్న యువతి.. వృద్ధురాలితో మాటలు కలిపింది. తమది కూడా వేలటూరేనని నమ్మించింది. మరీ ఇంత నీరసించిపోయావేంటంటూ పండ్ల రసం ఇచ్చి తాగమంది. అది తాగిన కాసేపటికే వృద్ధురాలు స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఐదు సవర్ల బంగారు నగలు, రూ.14 వేల నగదు తీసుకుని అద్దంకి మండలం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద వృద్ధురాలిని వదిలి పరారైంది.

కాగా, తల్లి క్షేమంగా ఊరికి చేరినదీ, లేనిదీ తెలుసుకునేందుకు ఒంగోలు నుంచి కుమారుడు ఆమె ఫోన్‌కు కాల్ చేశాడు. అయితే, ఫోన్ కలవకపోవడంతో కంగారు పడిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, ఆమె ఫోన్ సిగ్నల్ శింగరకొండపాలెం టవర్‌ను చూపిస్తుండడంతో ఒంగోలు పోలీసులు అద్దంకి స్టేషన్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More Telugu News