Andhra Pradesh: జగన్ ఆ నిర్ణయం తీసుకోకుంటే ఈపాటికి టీడీపీ దుకాణం ఖాళీ అయిపోయేది!: ఏపీ మంత్రి మోపిదేవి

  • విశాఖ భూ ఆక్రమణలపై విచారణ జరుపుతాం
  • దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • విశాఖలో మీడియాతో ఏపీ మంత్రి

విశాఖపట్నంలో భూకుంభకోణంపై ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా పార్టీలోకి తీసుకున్నారని మోపిదేవి విమర్శించారు.

‘టీడీపీలా మేం అడ్డగోలుగా ఎవరినీ పార్టీలోకి తీసుకోం. ఎవరైనా రావాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేశాకే రావాలి’ అని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని చెప్పారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి మాట్లాడారు. ఫిరాయింపుల విషయంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోకుంటే టీడీపీ దుకాణం ఈపాటికి ఖాళీ అయిపోయేదనీ, టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయేవాళ్లని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో భూ కుంభకోణాలపై వచ్చిన అన్ని అభియోగాలపై విచారణ జరిపిస్తామనీ, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఇందుకు జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

More Telugu News