Andhra Pradesh: 'హెల్మెట్ పెట్టుకోవా?' అంటూ ఆటో డ్రైవర్ కు జరిమానా విధించిన బెజవాడ పోలీసులు!

  • విజయవాడలోని మూడో పట్టణ పీఎస్ పరిధిలో ఘటన
  • ఏపీ 16 టీఎస్ 8597 నంబర్ తో తిరుగుతున్న ఆటో
  • హెల్మెట్ ధరించలేదని వింత కారణం చెప్పిన పోలీసులు

ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలి.. కారు, ఇతర వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగితే ఇవి ప్రాణాలను కాపాడుతాయి. కానీ ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లు కూడా హెల్మెట్లు, సీటు బెల్టులు పెట్టుకోవాలేమో.. లేదంటే ట్రాఫిక్ పోలీసులకు భారీగా జరిమానా సమర్పించుకోవాల్సి రావచ్చు. తాజాగా విజయవాడలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.

విజయవాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి ఏపీ 16 టీఎస్ 8597 నంబర్ తో తిరుగుతున్న ఆటోపై ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. అయితే సిగ్నల్ జంప్ చేశాడనో, ఓవర్ లోడ్ తో వెళుతున్నాడనో కాదు. అతను ఆటో నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదట. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. చివరికి ఈ వ్యవహారం మీడియా దృష్టికి రావడంతో ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందిస్తూ..‘ సాంకేతికలోపాల కారణంగా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కరిస్తాం’ అని తెలిపారు.

More Telugu News