ISRO: ఇస్రోకు అండగా యావత్ భారతదేశం.. కోల్పోయింది సిగ్నల్స్‌నే కానీ నమ్మకాన్ని కాదంటున్న ప్రజలు!

  • శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పిన మోదీ
  • ఇప్పటి వరకు సాధించిందేమీ చిన్న విజయం కాదన్న ప్రధాని
  • ఇస్రో బృందం అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో సాంకేతిక సమస్యలు తలెత్తి విక్రమ్ నుంచి సంకేతాలు నిలిచిపోవడంతో శాస్త్రవేత్తలు, దేశ ప్రజలు నిరాశలో మునిగిపోయారు. ప్రయోగం చివరి క్షణంలో సంకేతాలు ఆగిపోవడంతో బెంగళూరులోని ఇస్‌ట్రాక్ సెంటర్‌లో నిశ్శబ్దం రాజ్యమేలింది. చంద్రుడిపై ల్యాండర్ దిగే అద్భుత క్షణాలను వీక్షించేందుకు బెంగళూరు చేరుకున్న ప్రధాని మోదీ వీరికి ధైర్యం చెప్పారు.

శాస్త్రవేత్తల కృషి, పట్టుదల అభినందనీయమని, ఇప్పటి వరకు సాధించిన విజయం ఏమంత చిన్నది కాదని ధైర్యం నింపారు. వారిని చూసి తాము గర్విస్తున్నామని పేర్కొన్నారు. దేశం మొత్తం శాస్త్రవేత్తల వెంటే ఉందన్నారు. వారిని చూసి దేశం గర్విస్తోందని, భవిష్యత్తులోనూ అంతరిక్ష కార్యక్రమాల కోసం గట్టిగా కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు.

 ఇస్రో బృందం అద్భుతంగా పనిచేసిందని, శాస్త్రవేత్తలు ఎంతో అంకితభావంతో పనిచేశారని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొనియాడారు. భవిష్యత్‌లో సంపూర్ణ విజయం సాధిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. చంద్రయాన్2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం, నిబద్ధతను చూసి దేశం మొత్తం వారివైపు నిలిచిందని, భవిష్యత్తులో విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ధైర్యంగా ఉండాలని శాస్త్రవేత్తలకు సూచించారు.

ఇస్రో బృందం పట్టుదల, అంకితభావం ప్రతీ భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. శాస్త్రవేత్తల శ్రమ వృథా కాదని, భవిష్యత్ విజయాలకు ఇది మార్గమని పేర్కొన్నారు. విజయం వరించనంత మాత్రాన ఆగిపోవద్దని, విజయం సాధించే వరకు కృషి చేయాలని ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు. ఇక, ఇస్రోకు దేశ ప్రజలు సైతం అండగా నిలిచారు. కోల్పోయింది సిగ్నల్సే కానీ నమ్మకాన్ని మాత్రం కాదంటూ ట్వీట్లు చేస్తూ ఇస్రోకు అండగా నిలుస్తున్నారు.

More Telugu News