Andhra Pradesh: జగన్ సాక్షిగా చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం!

  • శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో కార్యక్రమం
  • చంద్రబాబు-కరవు కవల పిల్లలన్న స్పీకర్
  • జైహింద్.. జై జగన్ అంటూ నినాదాలు

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ తన 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తిచేసుకున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న జగన్ ‘నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా’ అని ప్రజల ముందుకు వచ్చారని ప్రశంసించారు. ఇలాంటి ముఖ్యమంత్రి భారత రాజకీయ చరిత్రలో ఒక్క జగన్ మాత్రమేనని కితాబిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తమ్మినేని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, మంత్రి కొడాలి నాని సహా పలువురు నేతలు, అధికారులు హాజరయ్యారు.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ వాగ్దానాలను నిలబెట్టుకున్నారనీ, ఆయన రాకతో పలాస ప్రాంతం పునీతమైందని వ్యాఖ్యానించారు. ఉద్దానంలోని కిడ్నీ సమస్యను పరిష్కరిస్తామని ఎందరో ముఖ్యమంత్రులు వచ్చివెళ్లారనీ, ఎవ్వరూ చేయలేకపోయారని గుర్తుచేశారు. కానీ పాదయాత్రలో ఉద్దానం సమస్యను గుర్తించిన జగన్.. హామీ ఇచ్చారనీ, ఈరోజు 200 పడకల ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన సామాజికవర్గాల ప్రజలు అధికమన్నారు. పలాస ప్రజలు వెనుకబడిన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, జగన్ తనను ఏకంగా శాసన సభాపతిగా చేశారని హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తమ్మినేని సీతారాం సెటైర్లు వేశారు. ‘జగన్ మోహన్ రెడ్డి, రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు వర్షం రాదంటే వార్త అవుతుంది. వర్షం వస్తే అసలు అది వార్తే కాదు. వరుణదేవుడు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. నేనీ మాట చెప్పకూడదు కానీ. కరవు-చంద్రబాబు నాయుడు కవల పిల్లలు. వరుణుడు-వైఎస్సార్ కుటుంబం బాంధవ్యంతో కూడుకున్న వ్యక్తులు. ఈరోజు వర్షం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తున్నా జైహింద్.. జై జగన్’ అంటూ తమ్మినేని తన ప్రసంగాన్ని ముగించారు. 

More Telugu News