KCR: యాదగిరిగుట్ట ఆలయ రాతి స్తంభాలపై కేసీఆర్ చిత్రాలు!

  • శరవేగంగా ఆలయ అభివృద్ధి పనులు
  • కేసీఆర్ పథకాలన్నీ రాతి స్తంభాలపై
  • వెయ్యేళ్లు నిలిచేలా చిత్రాలు

లక్ష్మీ నరసింహుడు స్వయంభువుగా వెలిసిన యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతుండగా, ఇక్కడ ఏర్పాటు చేయనున్న రాతి శిలలపై సీఎం కేసీఆర్ చిత్ర పటాలను చెక్కారు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారు చిహ్నం, కేసీఆర్ కిట్, హరితహారం, రాష్ట్ర పక్షి నెమలి, జంతువు కృష్ణ జింక తదితరాలను కూడా పొందుపరిచారు. ఈ రాతి స్తంభాలను అష్టభుజి ప్రాకార మండపంలో నిక్షిప్తం చేయనున్నారు. మరో వెయ్యేళ్ల పాటు కేసీఆర్ ప్రజలకు గుర్తుండేలా చూసేందుకే 'సారు-కారు... సర్కారు పథకాలు'ను స్తంభాలపై చెక్కినట్టు తెలుస్తోంది.

వీటితో పాటు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని తెలియజేసేలా ఆనాటి చిహ్నాలు, బొమ్మలు, ప్రజల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా బొమ్మలనూ స్తంభాలపై చెక్కారు. ప్రత్యేకంగా తెప్పించిన కృష్ణ శిలలపై ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలనూ చెక్కారు. ఇవన్నీ ఆలయంలో శాశ్వతంగా అమరిపోనున్నాయి. ప్రస్తుతం చలామణిలో లేని ఒక పైసా, రెండు పైసలు, అణా, అర్ధణా బొమ్మలు కూడా వీటిపై ఉన్నాయి.

More Telugu News