Srisailam: మరోసారి జల దృశ్యం... దాదాపు 2 లక్షల క్యూసెక్కులకు చేరిన కృష్ణమ్మ వరద!

  • నేడు తెరచుకోనున్న శ్రీశైలం గేట్లు
  • ఎల్లుండి నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత
  • ఎక్కడా నీరు నిల్వకు అవకాశం లేదంటున్న అధికారులు

కేవలం మూడు వారాల వ్యవధిలోనే కృష్ణానదిపై ఉన్న అన్ని జలాశయాల ముందూ జలదృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణసాగర్, జూరాల, తుంగభద్ర, భీమ జలాశయాల గేట్లు తెరచుకోగా, మరికాసేపట్లో శ్రీశైలం గేట్లను ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలానికి వస్తున్న వరద సుమారు 2 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో జలాశయం నిండుకుండలా మారింది.

వస్తున్న నీటిలో దాదాపు 80 వేల క్యూసెక్కుల నీటిని వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాలు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా వదులుతుండగా, నికరంగా లక్ష క్యూసెక్కులకు పైగా నీరు నిల్వ అవుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోగా, ఇకపై నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో నేడు శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి, నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నామని అధికారులు వెల్లడించారు.

మరోవైపు నాగార్జున సాగర్ జలాశయం కూడా దాదాపు నిండుకుండలానే ఉంది. పది రోజుల క్రితం డ్యామ్ గేట్లను మూసివేసిన తరువాత, కాలువలకు నీటి విడుదల మినహా, నీటి నిల్వ కొనసాగింది. దీంతో శ్రీశైలం గేట్లను ఎత్తిన రెండో రోజునే సాగర్ గేట్లను కూడా ఎత్తాల్సి వస్తుందని అంచనా. దీంతో మరోసారి కృష్ణమ్మ పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంటుందనే చెప్పచ్చు! 

More Telugu News