TTD: టీటీడీ పాలకమండలి ఎంపికకు కసరత్తు.. భారీగా ఆశావహుల జాబితా!

  • అధ్యక్షుడు, ఎక్స్‌అఫీషియో సభ్యులు పోగా మిగిలింది వీరే
  • ఆశావహుల జాబితా భారీగానే
  • సభ్యుల నియామకం కత్తిమీద సామే

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కోసం 25 మంది సభ్యులతో జంబో టీం సిద్ధమవుతున్నా సాంకేతికంగా చూస్తే కొత్తగా అవకాశం దక్కేది ఇరవై మందికే. దేవుని సేవతోపాటు కాస్త ప్రాచుర్యం ఉన్న పదవి కావడంతో పాలక మండలి సభ్యత్వానికి పోటీ ఆషామాషీగా ఉండదు. స్వరాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి పదవిని ఆశించే వారూ ఉంటారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పాలక మండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 25కు పెంచుతూ కేబినెట్‌ ఆమోదం పొందింది.

కానీ చైర్మన్‌తోపాటు టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్‌, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు ఎక్స్‌అఫీషియో సభ్యుల హోదాలో ఉంటారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) చైర్మన్‌ కూడా మరో ఎక్స్‌అఫీషియో సభ్యునిగా వ్యవహరించనున్నారు. అంటే మొత్తం ఐదు స్థానాలు ఇప్పటికే భర్తీ అయినట్టు. ఇక మిగిలిన ఇరవై స్థానాల కోసమే ప్రభుత్వం సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

చైర్మన్‌ నియామకం జరిగి చాలా రోజులు అవుతున్నా సభ్యుల సంఖ్య పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం పాలక మండలి నియామకాన్ని ఆలస్యం చేస్తూ వచ్చింది. తాజాగా కేబినెట్‌ ఆమోదం కూడా లభించడంతో మిగిలిన 20 మంది సభ్యుల నియామకం త్వరలో జరిగే అవకాశం ఉంది. ఆశావహుల జాబితా భారీగానే ఉందని, సభ్యత్వం కోసం కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నాయని సమాచారం. ఈ నేపధ్యంలో పాలక మండలిలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

More Telugu News