Andhra Pradesh: ఎన్నికల ముందు జగన్ మన ఊర్లకు వచ్చారు.. దొరికినవాళ్లందరికీ ముద్దులు పెట్టారు!: నారా లోకేశ్ సెటైర్లు

  • ఇప్పుడేమో లాఠీలతో కొట్టిస్తున్నారు
  • ఏపీలో 20 లక్షల మంది కార్మికులకు ఉపాధి లేదు
  • నర్సీపట్నంలో మాట్లాడిన టీడీపీ నేత

సాధారణంగా ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏ పార్టీ కార్యకర్తలైనా పారిపోతారనీ, కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. జగన్ ప్రభుత్వం ఏదో చేయాలనుకుంటోంది.. కనీసం ఆరు నెలల గడువు ఇద్దాం అని తాము భావించామని లోకేశ్ చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఇది తుగ్లక్ పాలనలాగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఓ ట్రాక్టర్ లోడ్ ఇసుక రూ.800-1,200 అయ్యేదని లోకేశ్ అన్నారు. కానీ ఆ ట్రాక్టర్ ఇసుక ధర ఇప్పుడు రూ.10,000కు చేరుకుందని ఆరోపించారు. విశాఖలోని నర్సీపట్నంలో ఈరోజు పర్యటించిన లోకేశ్.. టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ ఇసుక సొమ్మంతా స్థానిక ఎమ్మెల్యే, సీఎం జగన్ జేబుల్లోకి వెళుతోందని లోకేశ్ విమర్శించారు. ఏపీలో ఇప్పుడు బస్తా ఇసుక రూ.400 పలుకుతోందనీ, ఇదే తుగ్లక్ పరిపాలన అని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రస్తుతం 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్, సెంట్రీ, ఇతర కార్మికులకు ఉపాధి లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం కంటే తక్కువ ధరకు ఇసుకను అందిస్తామని జగన్ ఎన్నికల సమయంలో చెప్పారని లోకేశ్ గుర్తుచేశారు. కానీ మూడు నెలలు గడిచిపోయినా తుగ్లక్ గారి హామీ నెరవేరలేదనీ, పని కాలేదని విమర్శించారు.

‘ఎన్నికల ముందు జగన్ మన ఊరికి వచ్చారు.. దొరికినవాళ్లందరికీ ముద్దులు పెట్టారు. అదే వ్యక్తి ఈరోజు లాఠీదెబ్బలు తినిపిస్తున్నాడు. మంగళగిరిలోని ఆయన ఇంటి చుట్టూ 144 సెక్షన్ విధించారు. అంటే ఒక 10 మంది కలిసి కూడా రావడానికి లేదు. నాకు తెలిసినంతవరకూ ఏపీ ముఖ్యమంత్రి ఇంటిముందు ఎప్పుడూ 144 సెక్షన్ పెట్టలేదు. సీఎం జగన్ ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే.. పొద్దున్నే ఆశావర్కర్లు, మధ్యాహ్నం అంగన్ వాడీ టీచర్లు, ఆ తర్వాత ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నాకు దిగుతున్నారు. దాన్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను. చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడూ ఆయన ఇంటి ముందు ఒక్క ధర్నా కూడా జరగలేదు. ఊరూరు తిరిగిన జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు’ అని లోకేశ్ దుయ్యబట్టారు.

More Telugu News