Stephen Ravindra: జగన్ విన్నపం పట్ల స్పందించని కేంద్రం... తెలంగాణకే స్టీఫెన్ రవీంద్ర

  • స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తెచ్చుకోవాలని భావించిన జగన్
  • అమిత్ షాను నేరుగా కలిసి విన్నవించిన సీఎం
  • నిన్న తెలంగాణలో విధుల్లో చేరిన రవీంద్ర

సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యుటేషన్ పై తెలంగాణ నుంచి ఏపీకి పంపించాలంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన విన్నపాన్ని కేంద్ర హోంశాఖ పట్టించుకోలేదని తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన వెంటనే స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపించాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు. దానికి కేసీఆర్ సమ్మతించారు. తెలంగాణ నుంచి రవీంద్రను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే స్టీఫెన్ రవీంద్ర అంతర్రాష్ట్ర బదిలీ కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర హోం శాఖకు లేఖలు రాశాయి. స్టీఫెన్ రవీంద్ర కూడా డీఓపీటీ అధికారులను కలసి బదిలీ గురించి అభ్యర్థించారు. అయితే, దరఖాస్తులో బలమైన కారణాలు లేవంటూ అధికారులు ఫైల్ ను పక్కన పెట్టారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జగన్ నేరుగా కలిసి... స్టీఫెన్ రవీంద్ర బదిలీ అంశాన్ని ప్రస్తావించారు. పరిశీలిస్తామని అమిత్ షా హామీ కూడా ఇచ్చారు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇన్ని రోజులు సెలవులో గడిపిన రవీంద్ర... ఈ సారి సెలవును పొడిగించుకోకుండా... నిన్న తిరిగి తెలంగాణలో తన విధుల్లో చేరారు. హైదరాబాద్ రేంజ్ ఐజీగా బాధ్యతలను స్వీకరించారు.

More Telugu News