world top living cities: అత్యంత నివాసయోగ్యమైన వంద నగరాల్లో భారత్‌కు దక్కని చోటు

  • ఆస్ట్రియా రాజధాని వియన్నా‌కే మళ్లీ మొదటి స్థానం
  • ఐరోపాలోనే అత్యధిక నగరాలు
  • 118, 119 స్థానాల్లో వరుసగా నిలిచిన ఢిల్లీ, ముంబయి

ప్రపంచంలోని అత్యంత నివాసయోగ్యమైన నగరాలుగా గుర్తింపు పొందిన మొదటి వందలో భారత్‌లోని ఒక్క నగరానికీ చోటు దక్కలేదు. జీవన ప్రమాణాలు, నేరాల నమోదు, ప్రయాణ, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, రాజకీయ, ఆర్థిక స్థిరత్వం వంటి పలు అంశాల ప్రాతిపదికన ఏటా ‘ది ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌’ సర్వే చేసి వాటి ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ ఏడాది ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో వరుసగా రెండో సంవత్సరం కూడా ఆస్ట్రియా రాజధాని వియన్నా‌కే మళ్లీ మొదటి స్థానం దక్కింది. గత ఏడాది వరకు మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరాన్ని వెనక్కినెట్టి వియన్నా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది కూడా తన స్థానాన్ని ఈ నగరం నిలబెట్టుకుంది. సిడ్నీ, ఒసాకా తరువాతి రెండు స్థానాల్లో నిలిచాయి.

కాగా, మన దేశంలోని ఢిల్లీ 118వ స్థానంలోను, ముంబయి 119వ స్థానంలోను నిలిచాయి. వాస్తవంగా ఢిల్లీ గత ఏడాది 112వ స్థానం సాధించింది. ఈ ఏడాది మరో ఆరు స్థానాలకు దిగజారింది. అలాగే ముంబయి నగరం గత ఏడాది 118వ స్థానంలో నిలవగా ఈ ఏడాది మరో స్థానం దిగజారి 119 వద్ద నిలిచింది. నేరాల రేటు పెరగడం, తీవ్ర కాలుష్యం ఈ నగరాల స్థానం దిగజారడానికి కారణమని సంస్థ పేర్కొంది.

 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం 140 దేశాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రాంతాల వారీగా వస్తే పశ్చిమ ఐరోపా, దక్షిణ అమెరికాలు నివాసానికి అనువైన ప్రాంతాలుగా ఈ సంస్థ గుర్తించింది. కాగా ఈ సంస్థ రూపొందించిన వంద నగరాల జాబితాలోని తొలి 20 నగరాల్లో ఎనిమిది ఐరోపా దేశాల్లోనే ఉండడం విశేషం.

అయితే ప్రముఖ నగరం పారిస్‌ కూడా ఈ ఏడాది 8 స్థానాలు దిగజారి 25 స్థానంలో నిలిచింది. లండన్‌, న్యూయార్క్‌ నగరాలు వరుసగా 48, 58వ స్థానంలో నిలిచాయి. నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లే సిరియా రాజధాని డమాస్కస్‌ చివరి స్థానంలో నిలిచింది. ట్రిపోలీ, ఢాకా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

More Telugu News