యూఎస్ ఓపెన్ లో మరో సంచలనం... జకోవిచ్ కూడా ఇంటికి!

04-09-2019 Wed 11:51
  • ఆట మధ్యలో పట్టేసిన తొడ కండరాలు
  • ఓటమి ముంగిట రిటైర్డ్ హర్ట్ గా వెనక్కు
  • మహిళా టాప్ సీడ్ నయోమీ ఒసాకా కూడా ఓటమి
ప్రీ క్వార్టర్ ఫైనల్స్ వరకూ సజావుగా సాగుతూ వచ్చిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో, నేడు మాత్రం సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే రోజర్ ఫెదరర్ ఓటమిపాలుకాగా, కొద్దిసేపటి క్రితం జకోవిచ్ సైతం వెనుదిరిగాడు. ఈ టోర్నీలో టాప్ సీడ్ గా బరిలోకి దిగిన సెర్బియా స్టార్ జకో, 23వ సీడ్ వావ్రింకా చేతిలో 4–6, 5–7, 1–2  స్కోర్ వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అప్పటికే జకో ఓటమి దాదాపు ఖరారుకాగా, తొడ కండరాలు పట్టేయడంతో అతను వైదొలగాల్సి వచ్చిందని జకో మేనేజర్ వెల్లడించాడు.

మరో పోటీలో రెండో సీడ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 6-3, 6-1, 6-2 తేడాతో క్రొయేషియాకు చెందిన సిలిచ్ పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలోనూ ఓ సంచలనం నమోదైంది. టాప్ సీడ్ నయోమీ ఒసాకా, 5-7, 4-6 తేడాతో 13వ సీడ్, స్విస్ కు చెందిన బెన్సిచ్ చేతిలో ఓడిపోయింది.