Tirumala: తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ పూర్తిగా నిలిపివేత!

  • ఇక తిరుపతిలో మాత్రమే టోకెన్ల జారీ
  • రద్దీని తగ్గించేందుకేనన్న అధికారులు
  • తిరుమలలో రద్దీ సాధారణం

తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా నిలిపివేసింది. గడచిన ఏడాదిన్నరగా తిరుమలతో పాటు తిరుపతిలోనూ ప్రత్యేక కేంద్రాల ద్వారా ఈ టోకెన్లను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శనం కోసం వచ్చే భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని, టోకెన్ల కేంద్రాల వద్దే బారులు తీరి ఉంటుండటంతో దశలవారీగా తిరుమలలోని ఈ సెంటర్లను మూసి వేయాలని టీటీడీ గతంలోనే నిర్ణయించింది. తిరుమలలో రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కూడా వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో ఇకపై తిరుపతిలోని కేంద్రాల్లో మాత్రమే టైమ్ స్లాట్ టోకెన్లు లభ్యమవుతాయని, తిరుమలలోని అన్ని కేంద్రాలనూ మూసివేశామని టీటీడీ ప్రకటించింది. కాగా, తిరుమలలో ఈ ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి కేవలం 4 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి. సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న మంగళవారం నాడు స్వామివారిని 63,580 మంది దర్శించుకున్నారని, హుండీ ఆదాయం రూ. 2.98 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

More Telugu News