hospitals: ఇక డాక్టర్‌పై చేయిపడితే జైలుకే.. నో బెయిల్.. ముసాయిదా బిల్లు రెడీ

  • ఆసుపత్రులలో జరిగే హింసకు అడ్డుకట్ట
  • ముసాయిదా బిల్లు రెడీ
  • మరో నెల రోజుల్లోనే చట్టంగా మారనున్న బిల్లు

ఆసుపత్రులలో జరుగుతున్న హింసను అరికట్టేందుకు కేంద్రం సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై దాడిచేసే వారిని కఠినంగా శిక్షించేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు. మరో నెల రోజుల్లో రాబోతున్న ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్రం ఆన్‌లైన్‌లో పెట్టింది. ఈ బిల్లుపై అభిప్రాయాలు తెలపాలని కోరింది.  

కేంద్రం పెట్టిన ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ఆసుపత్రిలోని వైద్యుడు, నర్సులపై దాడిచేస్తే కనీసం ఆరు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాయపరిచినా, హింసించినా దాని తీవ్రతను బట్టి మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. దీంతోపాటు రూ.5 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాడిలో తీవ్రంగా గాయపడి వైకల్యం ఏర్పడినా, కోలుకోలేని స్థితికి చేరుకున్నా, చనిపోయినా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. దీంతోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.  

తమపై జరిగిన దాడికి సంబంధించి వైద్యులు చిన్న కాగితంపై రాసి ఫిర్యాదు చేసినా సీఆర్‌పీసీతో సంబంధం లేకుండా నిందితులను వెంటనే అరెస్ట్ చేస్తారు. బెయిలు కూడా ఇవ్వరు. డీఎస్పీ ర్యాంకు అధికారి కేసు విచారణను చేపడతారు. ఒకవేళ ఆస్తినష్టం జరిగితే మార్కెట్ విలువకు రెండింతల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వైద్య సిబ్బందిని గాయపరిస్తే దాని తీవ్రతను బట్టి లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ముసాయిదా బిల్లుకు వచ్చిన సలహాలు, సూచనల అనంతరం మార్పులు చేర్పులు చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News