Raatchasi: జ్యోతిక నటించిన 'రాచ్చసి' చిత్రంపై రివ్యూ రాసిన మలేసియా విద్యాశాఖ మంత్రి

  • ఇటీవలే విడుదలైన రాచ్చసి
  • టీచర్ పాత్ర పోషించిన జ్యోతిక
  • తెలుగులో రాక్షసిగా డబ్ అయిన సినిమా

కోలీవుడ్ లో రెండు నెలల క్రితం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం రాచ్చసి. తెలుగులో ఇది రాక్షసి పేరుతో వచ్చింది. ఇందులో ప్రముఖ నటి జ్యోతిక టీచర్ పాత్ర పోషించింది.  ఇందులో ఆమె పాత్ర బెత్తం పట్టుకుని పిల్లలను దారిలో పెట్టడమే కాదు, అవసరమైతే సమాజాన్ని కూడా చక్కదిద్దుతుంది. అయితే, ఈ సినిమాకు తాజాగా ఓ విశిష్టమైన గుర్తింపు దక్కింది. మలేసియా విద్యాశాఖ మంత్రి మస్లీ బిన్ మాలిక్ రాచ్చసి సినిమా చూసి తన అభిప్రాయాలను బయటికి వెలిబుచ్చకుండా ఉండలేకపోయారు.

ఈ సినిమాలో జ్యోతిక నటనను ఆయన ఆకాశానికెత్తేశారు. రాచ్చసి సినిమాపై రివ్యూ రాయకుండా ఉండలేకపోతున్నానని తెలిపారు. గతరాత్రి కొందరు అధికారులతో కలిసి సినిమా చూశానని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావంతులు అందరూ చూడాల్సిన సినిమా అని తెలుసుకున్నానని వెల్లడించారు. ఇందులో ప్రతి సీన్ చూస్తుంటే తమ దేశంలో పరిస్థితులను చూస్తున్నట్టే ఉందని ఆశ్చర్యపోయారు. జ్యోతిక పోషించిన గీతారాణి పాత్ర అద్భుతంగా ఉందని మస్లీ బిన్ మాలిక్ కితాబిచ్చారు.

విద్యార్థులు మధ్యలోనే స్కూలు మానేయకుండా ఈ సినిమాలో టీచర్ గీతారాణి ఎంతో శ్రమించారని, పోలీసుల సాయం కూడా తీసుకుని కృషి చేశారని, మలేసియాలోనూ ఇలాంటి వ్యవస్థ కోసమే తాము పాటుపడుతున్నామని మంత్రి వెల్లడించారు. అసలు, ఇలాంటి సబ్జెక్ట్ తో ఓ సినిమా తీయడమే తమను విశేషంగా ఆకట్టుకుందని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో వివరించారు.

More Telugu News