Amit Shah: జమ్మూ కశ్మీర్ పంచాయతీ సంఘ సభ్యులతో అమిత్ షా కీలక సమావేశం

  • హోం శాఖ కార్యాలయంలో కొనసాగుతున్న సమావేశం
  • సమావేశానికి హాజరైన మంత్రులు, అధికారులు
  • ఆర్టికల్ 370 రద్దు, పంచాయతీల అభివృద్ధిపై చర్చ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జమ్మూకశ్మీర్ నుంచి వచ్చిన పంచాయత్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. భేటీకి ముందు ఆల్ జమ్మూకశ్మీర్ పంచాయత్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, 'అమిత్ షాతో మేము భేటీ కాబోతున్నాం. ఆర్టికల్ 370 రద్దు అంశంపై చర్చ జరగనుంది. పంచాయతీల అభివృద్ధిపై కూడా చర్చించబోతున్నాం' అని తెలిపారు.

అసోసియేషన్ కు చెందిన మరో సభ్యుడు మాట్లాడుతూ, ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు ధన్యవాదాలు చెప్పబోతున్నామని తెలిపారు. ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నందుకు జమ్మూకశ్మీర్ కు ఇది సంతోషకర సమయమని చెప్పారు. ఈ ఆర్టికల్ ను రద్దు చేయాలని జమ్ము ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తమ రాష్ట్రంలోని పంచాయతీలకు ఉన్న సమస్యలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లబోతున్నామని చెప్పారు.

ఈ భేటీలో అమిత్ షాతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, హోం సెక్రటరీ ఏకే భల్లా, అడిషనల్ సెక్రటరీ జ్ఞానేశ్ కుమార్ లు కూడా పాల్గొన్నారు. హోం శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది.

More Telugu News