USA: అమెరికాలో దారుణం.. జంక్ ఫుడ్ కారణంగా చూపు, వినికిడి కోల్పోయిన పిల్లాడు!

  • టెన్నిసీ రాష్ట్రంలోని బ్రిస్టల్ లో ఘటన
  • పండ్లు, కూరగాయలు తినని బాలుడు
  • చికిత్స అందించినా దక్కని ఫలితం

అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కూరగాయలు, పండ్లపై అయిష్టతతో కేవలం ఫాస్ట్ పుడ్ మాత్రమే తింటున్న ఓ పిల్లాడు కంటిచూపును, వినికిడి శక్తిని శాశ్వతంగా కోల్పోయాడు. ఈ ఘటన టెన్నిసీ రాష్ట్రంలోని బ్రిస్టల్ కౌంటీలో చోటుచేసుకుంది. బ్రిస్టల్ కు చెందిన ఓ పిల్లాడు(14) తొలుత అలసిపోయినట్లు అనిపిస్తోందని స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన డాక్టర్లు తొలుత విస్తుపోయారు.

ఎందుకంటే అతని శరీరంలో ఎర్రరక్త కణాలు సాధారణం కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. అంతేకాకుండా బాలుడి శరీరంలో బీ12, కాపర్, సెలీనియమ్, ఇతర విటమిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఎముకల పటిష్టత కూడా తగ్గిపోయింది. దీంతో సదరు టీనేజర్ కు మాక్రోటిక్ అనీమియా అనే వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

అతను ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఆహారంలో పండ్లు, కూరగాయలను తినేందుకు ఇష్టపడేవాడు కాదనీ, ఫ్రెంచ్ ఫ్రైస్, బ్రెడ్డు, చిప్స్, శుద్ధి చేసిన మాంసం, వేపుళ్లు మాత్రమే తినేవాడని డాక్టర్లు చెప్పారు. అతనికి ఏడాది పాటు బీ12 ఇంజెక్షన్లు, ఇతర మందులు ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు. ఏడాది తర్వాత అతని వినికిడి, చూపు బాగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. 17 సంవత్సరాల వయసుకు చేరుకునేసరికి అవి పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

More Telugu News