Krishna River: అటు జూరాల, ఇటు ప్రకాశం బ్యారేజ్... మళ్లీ పెరుగుతున్న కృష్ణమ్మ వరద!

  • కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు
  • కృష్ణా, గుంటూరు, నల్గొండ జిల్లాల్లో కూడా
  • నెమ్మదిగా పెరుగుతున్న వరద

కర్ణాటకలో కురుస్తున్న తేలికపాటి వర్షాలకు ఆల్మట్టి జలాశయానికి వస్తున్న వరదను వస్తున్నట్టు కిందకు వదులుతూ ఉండటంతో జూరాల వద్ద క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇదే సమయంలో గుంటూరు, నల్గొండ, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద నదిలో నీరు పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 5 వేల క్యూసెక్కులపైగా నీరు వస్తోంది. దీంతో నేడు మరోసారి కొన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలవచ్చని అధికారులు అంటున్నారు.

కాగా, జూరాల వద్ద సుమారు 12 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతూ ఉండగా, వరద 30 వేల క్యూసెక్కులను దాటిన తరువాతనే గేట్లను తెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వరదను కాలువల ద్వారా వ్యవసాయ, తాగునీటి అవసరాల నిమిత్తం వదులుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి శ్రీశైలం వద్ద మాత్రం వరద ప్రవాహం నమోదు కావడం లేదు. జలాశయంలోని నీటిని పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల, హంద్రీనీవా తదితర కాలువలకు వదులుతూ, కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు.

More Telugu News