MS Dhoni: జమైకా టెస్టు విజయంతో ధోనీ రికార్డును అధిగమించిన విరాట్ కోహ్లీ

  • టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్
  • టెస్టుల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు
  • 27 విజయాలు అందించిన ధోనీ రికార్డు బద్దలు

విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. మొత్తం 48 టెస్టులకు సారథ్యం వహించిన కోహ్లీ 28 టెస్టు విజయాలతో మాజీ సారథి ధోనీ రికార్డును అధిగమించాడు. 60 మ్యాచుల్లో జట్టును ముందుండి నడిపించిన ధోనీ 27 విజయాలు అందించాడు. జమైకా టెస్టును గెలవడం ద్వారా కోహ్లీ ఆ రికార్డును అధిగమించాడు. అంతేకాదు, కేవలం 48 టెస్టుల్లోనే ఆ ఘనత సాధించడం విశేషం.

విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 318 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో విదేశాల్లో అత్యధిక టెస్టుల్లో జట్టును గెలిపించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ.. మాజీ సారథి సౌరవ్ గంగూలీపై ఉన్న రికార్డును చెరిపేశాడు. గంగూలీ సారథ్యంలోని భారత జట్టు విదేశాల్లో ఆడిన 28 టెస్టుల్లో 11 విజయాలు సాధిస్తే, కోహ్లీ 26 మ్యాచుల్లో 12 విజయాలు అందించి ‘దాదా’ రికార్డును బద్దలుగొట్టాడు. ఇప్పుడు అత్యధిక టెస్టు విజయాలు సాధించిన ధోనీ రికార్డును బద్దలు గొట్టి ఆ రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు. కాగా, విండీస్‌తో జరిగిన రెండు టెస్టులను గెలుచుకున్న భారత్ .. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో 120 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. కాగా, విండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం గమనార్హం.

More Telugu News