Banglore: పక్కింటి వాళ్లను దోపిడీ చేసేందుకు 10 మంది దొంగలను కిరాయికి తీసుకువచ్చిన మహిళ!

  • బెంగళూరులో ఘటన
  • చిట్టీల వ్యాపారంలో దివాలా తీసిన మహిళ
  • పక్కింట్లో ఒంటరిగా ఉంటున్న అత్తాకోడళ్లపై దృష్టి

బెంగళూరులో జరిగిన ఓ దోపిడీ కేసును విచారించిన పోలీసులకు ఆసక్తికర నిజాలు తెలిశాయి. పక్కింట్లో నివసిస్తున్న ఇద్దరు ఒంటరి మహిళలను దోపిడీ చేసేందుకు ఓ మహిళ ఏకంగా 10 మంది దొంగలతో ఒప్పందం కుదుర్చుకోవడం విస్తు గొలుపుతోంది. గిరిజమ్మ (47) అనే మహిళ కోననకుంటె ప్రాంతంలోని బ్యాంక్ కాలనీలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తోంది. ఆమె చిట్టీల వ్యాపారంలో తీవ్ర నష్టాలపాలై ఉన్నదంతా కోల్పోయింది.

గిరిజమ్మ పక్కింట్లో నరసమ్మ, ఆమె కోడలు ప్రభావతి ఉంటున్నారు. వారిద్దరికీ భర్తలు లేరు. ప్రభావతి టైలరింగ్ చేస్తోంది. అయితే, డబ్బుకు కటకటగా ఉండడంతో గిరిజమ్మ తన సమస్యలను సన్నిహితుడు దిచ్చిరాజుకు చెప్పుకుంది. అతని దృష్టి పక్కింట్లో ఉన్న అత్తాకోడళ్లపై పడింది. వారి వద్ద ఉన్న బంగారం కొట్టేస్తే గిరిజమ్మ కష్టాలు తీరిపోతాయని నమ్మించాడు. అతని మాటలకు సరేనన్న గిరిజమ్మ దిచ్చిరాజు చెప్పినట్టు అతని గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 28న ఆ ముఠా అత్తాకోడళ్లను నిర్బంధించి 298 గ్రాముల బంగారం దోపిడీ చేసింది.

దీనిపై కోననకుంటె పోలీసులు ఇరుగుపొరుగు వారిని విచారించే క్రమంలో గిరిజమ్మ వ్యవహారశైలి అనుమానాస్పదంగా అనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తమదైన శైలిలో విచారించడంతో మొత్తం కక్కేసింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా దిచ్చిరాజును, మిగతా ముఠా సభ్యులను కూడా పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ పలు దోపిడీలకు పాల్పడినట్టు విచారణలో గుర్తించారు.

More Telugu News