chandrayan-2: చందమామ వైపు ‘విక్రం’ ప్రయాణం.. ఆర్బిటర్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌

  • ఈరోజు మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య ప్రక్రియ
  • సెపరేషన్‌ను ఆసక్తిగా తిలకించిన ఇస్రో శాస్త్రవేత్తలు
  • ఈ నెల 7న చంద్రునిపై దిగనున్న విక్రం

జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించిన ల్యాండర్‌ ‘విక్రమ్‌’ ఆఖరి దశ ప్రక్రియకు విజయవంతంగా చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంట మధ్య ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ నిర్దేశించిన కక్ష్యలో  ప్రయాణిస్తోంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. చంద్రయాన్‌-2లో భాగంగా జూలై 22న నింగిలోకి దూసుకు వెళ్లిన ల్యాండర్‌ గత నెల 22న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

ఇక ల్యాండర్ విడిపడే ప్రక్రియ మిల్లీ సెకన్లలోనే పూర్తయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. తొలుత ఆర్బిటర్‌, ల్యాండర్‌ను సంధానించే రెండు బోల్టులు తెగిపోవడంతో ల్యాండర్‌ వేరుపడింది. ప్రస్తుతం ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతోంది. ఈనెల 3, 4 లేదీల్లో ల్యాండర్‌ కక్ష్యను తగ్గిస్తారు. ఫలితంగా అది 35 కిలోమీటర్లు/ 97 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరుతుంది. ఈనెల 7వ తేదీన ఆఖరి ప్రయాణం  మొదలవుతుంది. ఆ రోజున ల్యాండర్‌లోని ‘పవర్‌ డిసెంట్‌’ దశ ఆరంభమవుతుంది. వ్యోమ నౌకలోని ర్యాకెట్లను మండించడం ద్వారా ల్యాండర్‌ను కిందకు దించుతారు. ఈ ప్రక్రియ మొదలైన 15 నిమిషాల్లోగా ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతుంది. నాలుగు గంటలు తర్వాత అందులోని రోవర్‌ బయటకు వస్తుంది.

More Telugu News