India: భారత్ ఎవ్వరినీ నిరాశ్రయులను చేయరాదు.. ఎన్నార్సీపై స్పందించిన ఐక్యరాజ్యసమితి!

  • ఇటీవల ఎన్నార్సీని ప్రకటించిన కేంద్రం
  • 19 లక్షల మంది భారతీయులు కాదని ప్రకటన
  • వీరికి అన్నిరకాల సాయం అందించాలన్న ఐరాస

 అసోం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)ను కొన్నిరోజుల క్రితం ప్రకటించింది. బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి అక్రమంగా వలస వచ్చిన విదేశీయులను గుర్తించేందుకు ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా 19 లక్షల మంది అస్సాం ప్రజలు (మెజారిటీ ముస్లిం మతస్తులే) భారతీయులు కాదని ప్రకటించింది. దీంతో వీరంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తమ తాతలు కూడా ఇక్కడే పుట్టి పెరిగారనీ, తాము విదేశీయులం ఎలా అవుతామని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. పౌరసత్వాన్ని నిరాకరించడం ద్వారా భారత్ ఎవ్వరినీ నిరాశ్రయులను చేయరాదని సూచించింది.

ఇలాంటి చర్యలు ప్రజలు నిరాశ్రయులు కాకుండా తాము చేస్తున్న ప్రయత్నాలకు గొడ్డలిపెట్టు లాంటివని ఐరాస పునరావాస హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండీ తెలిపారు. విదేశీయులుగా ప్రకటించిన 19 లక్షల మందికి న్యాయ సహాయం, సమాచారం అందించాలని సూచించారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన ఎన్నార్సీ జాబితాలో 3.11 కోట్ల అస్సాం వాసులను భారత పౌరులుగా గుర్తించింది. మిగిలిన 19 లక్షల మంది భారత పౌరులు కాదని ప్రకటించింది. వీరిలో పలువురు సైనికులు, ఐఏఎఫ్ పైలట్లు ఉన్నారు. కాగా, వీరిని దేశం నుంచి బహిష్కరించబోమని కేంద్రం తెలిపింది. దీంతో ఈ 19 లక్షల మంది ప్రజల భవితవ్యంపై నీలినీడలు అలముకున్నాయి.

More Telugu News