Telangana: తెలంగాణ సీనియర్ నేత ముత్యం రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్, హరీశ్ రావు దిగ్భ్రాంతి!

  • నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముత్యంరెడ్డి
  • ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం ఆదేశం

తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ముత్యం రెడ్డి గెలుపొందారు. ఆయన రాజకీయ ప్రయాణం గ్రామ సర్పంచ్ గా ప్రారంభమైంది. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ముత్యంరెడ్డి, 2014లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో ముత్యంరెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ముత్యంరెడ్డి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర టీఆర్ఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

More Telugu News