Telangana: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నరసింహన్?

  • సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్
  • ఆయన సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన కేసీఆర్
  • త్వరలోనే ఉత్తర్వులు?

ఈఎస్ఎల్ నరసింహన్‌ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కానున్నారా? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. తెలంగాణ గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన నరసింహన్ స్థానంలో తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసై సౌందర రాజన్‌ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం.. నరసింహన్‌కు మాత్రం ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనపెట్టింది.

ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌ సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయనను తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి నరసింహన్‌ను కలిసిన కేసీఆర్ గవర్నర్‌గా ఇంతకాలం అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు.  

దాదాపు పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌కు ఇక్కడ మంచి పట్టుంది. పాలనా పరమైన విషయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. దీనికితోడు ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువ కావడంతో యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణానికి ఆయన సేవలు వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్టు చెబుతున్నారు. కొత్త గవర్నర్ సౌందర రాజన్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నరసింహన్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం.

More Telugu News