Pintu Tiwari: ఇద్దరు ఇంజినీర్లను చంపిన నిందితుడికి జైల్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు

  • మామూళ్లు ఇవ్వలేదని ఇంజినీర్లను హత్య చేసిన రౌడీషీటర్ పింటు తివారీ
  • జీవితఖైదు విధించిన న్యాయస్థానం
  • బర్త్ డే నాడు కేక్ కట్ చేసిన పింటు
  • ఇతర ఖైదీలకు మటన్ బిర్యానీతో విందు

బీహార్ లో అరాచక పరిస్థితుల గురించి ఒకప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకునేవారు. వాటికి కొనసాగింపుగా అనేక ఘాతుకాలు జరుగుతూనే ఉన్నాయి. దర్భంగాలో నాలుగేళ్ల కిందట పింటు తివారీ అనే రౌడీషీటర్ ఇద్దరు ఇంజినీర్లను హత్య చేశాడు. తనకు రౌడీ మామూలు ఇవ్వలేదన్న కోపంతో తన ముఠా సాయంతో వారిని చంపేశాడు. పింటూ తివారీకి కోర్టు జీవితఖైదు విధించింది. ప్రస్తుతం అతను పాట్నా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

అయితే, పింటూ తివారీ మరోసారి వార్తల్లోకెక్కాడు. జైల్లో అతని పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా నిర్వహించడమే అందుకు కారణం. పింటు కేక్ కట్ చేయడమే కాదు, ఇతర ఖైదీలకు స్వీట్లు పంచి సందడి చేశాడు. అంతేకాదు, తన జన్మదినం సందర్భంగా అందరికీ మటన్ బిర్యానీతో విందు ఏర్పాటు చేశాడు. ఇతర ఖైదీల్లో కొందరు అతనికి గిఫ్టులు కూడా ఇచ్చారు. మరో ఖైదీ మొబైల్ ఫోన్ లో పింటు పుట్టినరోజు వేడుకలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం మరో దిగ్భ్రాంతికర అంశం.

మొత్తమ్మీద ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, వ్యవహారం కాస్తా పోలీసు అధికారుల వరకు వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసు శాఖ జైలు అధికారులపై దర్యాప్తుకు సిద్ధమైంది. జైల్లో వేడుకలు నిర్వహించడం నిషిద్ధం అనుకుంటే, ఆ వేడుకలను రికార్డు చేయడానికి మొబైల్ ఫోన్ ఎవరిచ్చారంటూ పోలీసు అధికారులు మండిపడ్డారు.

More Telugu News