Telangana: ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి గెలవకపోయినా... నిబద్ధతతో ఎదిగిన తమిళ సై!

  • రెండు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు పార్లమెంట్ కు పోటీ
  • నాలుగుమార్లూ ఓటమి పాలైన సౌందరరాజన్
  • ఆమె సేవలకు లభించిన గుర్తింపు

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ సై సౌందరరాజన్. నేడు తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమించబడిన బీజేపీ మహిళా నేత. ప్రత్యక్ష ఎన్నికల్లో అటు అసెంబ్లీకిగానీ, ఇటు లోక్ సభకు గానీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయినప్పటికీ, పార్టీ పట్ల ఆమె చూపిన అంకితభావం, నిబద్ధతలకు ఇంతకాలానికి ఓ మంచి గుర్తింపు లభించింది.

మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సౌందరరాజన్, కొంతకాలం పాటు డాక్టర్ వృత్తిలోనూ కొనసాగారు. ఆపై బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై, సుమారు రెండు దశాబ్దాల క్రితమే పార్టీలో చేరి, రాష్ట్ర, జాతీయ నాయకత్వం దృష్టిలో పడ్డారు. 2006, 2011లో ఎమ్మెల్యేగా, 2009, 2019లో ఎంపీగా పోటీ చేసిన ఆమెను విజయలక్ష్మి వరించలేదు.

లోకల్ పార్టీల ప్రభావం, ముఖ్యంగా అన్నాడీఎంకే, డీఎంకేల ప్రాబల్యం అధికంగా ఉన్న తమిళనాడులో, బీజేపీ ప్రభావం నామమాత్రమే కావడంతో, బరిలో ఉన్న అభ్యర్థులకు గట్టి పోటీని ఇవ్వడం మినహా, ఎన్నడూ ఆమె విజయం సాధించలేదు. అయినప్పటికీ, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, వారి తప్పుడు విధానాలను ఎండగట్టడంలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఆమె సేవలకు గుర్తింపుగా రాష్ట్ర బీజేపీ బాధ్యతలను అందించిన అధిష్ఠానం, ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా ప్రమోషన్ ఇచ్చింది.

More Telugu News