Manmohan Singh: దేశంలో అసమర్థులు పెరిగిపోయారు: మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు

  • మోదీ వల్లే కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ
  • నోట్ల రద్దు నాటి నుంచి ఏర్పడిన సమస్య
  • ఇప్పటికైనా కళ్లు తెరవాలన్న మన్మోహన్ సింగ్

దేశ పాలకుల్లో అసమర్థుల సంఖ్య పెరిగిపోయిందని, అందువల్లే వ్యవస్థ మొత్తం కుంటుపడిందని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి, స్థూల జాతీయోత్పత్తి రేటు 5 శాతానికి పడిపోవడంపై స్పందించిన ఆయన, వ్యవస్థ మందగమన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన టీమ్ పనితీరే కారణమని అభిప్రాయపడ్డారు. ఇండియా ఎదిగే అవకాశాలు ఎన్నో ఉన్నా అసమర్థ నిర్వహణతోనే ఈ దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

ఇండియాలో ప్రొడక్టివిటీ 0.6 శాతానికి దిగజారడం తనకు ఎంతో విచారాన్ని కలిగిస్తోందని, నోట్ల రద్దు తరువాతి రోజు నుంచి ఈ సమస్య ఏర్పడిందని అన్నారు. ఆటోమొబైల్ రంగంలో 3.5 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని గుర్తు చేసిన మన్మోహన్ సింగ్, వస్తు సేవల పన్ను అమలు లోపాల ప్రభావం ఇంకా స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అసంఘటిత రంగం మరింత దారుణంగా తయారైందని, కొత్త ఉద్యోగాల సృష్టి విషయాన్ని పక్కనబెడితే, ఉపాధి లేక లక్షలాది మంది రోడ్డున పడుతున్నారని మోదీ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు.

ఇప్పటికైనా నరేంద్ర మోదీ, కక్ష సాధింపు చర్యలు మానేసి ఆర్థిక పరిపుష్టిపై దృష్టిని సారించాలని మన్మోహన్ సింగ్ సలహా ఇచ్చారు. భారత్ ను ఆర్థికమాంద్యం పూర్తిగా ముంచేయక ముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

More Telugu News