Crime News: బంగారం దొరికిందంటూ అమ్మకానికి...ఇత్తడి అని తేలడంతో కటకటాల వెనక్కి

  • మోసం చేసేందుకు ప్రయత్నించిన దంపతుల అరెస్టు
  • ఇంటిని నిర్మిస్తుండగా లభించిన నిధని ప్రచారం
  • బోడుప్పల్‌కు చెందిన వ్యక్తితో రూ.6 లక్షలకు ఒప్పందం

అత్యాశకు లోనయ్యే వారున్నంత కాలం మోసం చేసే వారికి లోటుండదు. ఇందుకు ఈ సంఘటన ఉదాహరణ. ఇల్లు నిర్మించేందుకు జరిపిన తవ్వకాల్లో తమకు బంగారం నిధి దొరికిందని నమ్మించి ఇత్తడి అమ్మకానికి పెట్టిన దంపతుల ఘరానా మోసం ఇది. పోలీసుల కథనం మేరకు....గుంటూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు (40), నాగమణి (35) దంపతులు. తాము ఇంటి నిర్మాణం పనులు చేపడుతుంటే బంగారం దొరికిందని, దాన్ని అమ్ముతామంటూ హైదరాబాద్‌ మేడిపల్లి పరిధిలోని బోడుప్పల్‌కు చెందిన భానుప్రసాద్‌తో సంప్రదించారు. తమకు దొరికిన బంగారంలో శాంపిల్‌ అంటూ ఓ చిన్న ముక్క అతనికి చూపించారు. ఇది నిజమేనని నమ్మిన భానుప్రసాద్‌ మొత్తం బంగారం కొనేందుకు రూ.6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.20 వేలు అఢ్వాన్స్‌గా ఇచ్చాడు.

అనంతరం తనకు ఇచ్చిన శాంపిల్‌ బంగారం ముక్కను పరిశీలించగా అది నకిలీ బంగారం అని తేలింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన భానుప్రసాద్‌ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిన్న బోడుప్పల్‌ బంగారు మైసమ్మ గుడివద్ద దంపతులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News