Ranga Reddy District: మొన్న భార్య.. ఇప్పుడు భర్త.. ఏసీబీ వలలో తహసీల్దార్ లావణ్య భర్త వెంకటేశ్వర్ నాయక్

  • రెండు నెలల వ్యవధిలో భార్యాభర్తలకు అరదండాలు
  • రూ.2.5 లక్షలు తీసుకుని యువకుడికి నకిలీ నియామకపత్రం
  • మధ్యవర్తికి కూడా అరదండాలు

రెండు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వో లావణ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. లంచాల ద్వారా సంపాదించిన సొమ్మును ఎక్కడ దాయాలో తెలియక రూ.93 లక్షల నగదును ఇంట్లోనే దాచుకున్న ఆమెను జులై 10న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోదాల్లో 43 తులాల బంగారు ఆభరణాలు కూడా లభించాయి. అంతకుముందు రైతు నుంచి లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్వో అనంతయ్యను పట్టుకున్న ఏసీబీ అధికారులు ఆయనిచ్చిన సమాచారంతో లావణ్యను అరెస్ట్ చేశారు. అప్పట్లో లావణ్య వ్యవహారం సంచలనమైంది.

తాజాగా, ఇప్పుడామె భర్త కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. జీహెచ్ఎంసీలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర నాయక్‌ను శుక్రవారం రాత్రి ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వరరావు  బృందం ఆయనను అరెస్ట్ చేసింది. హన్మకొండకు చెందిన రణ్‌ధీర్ అనే యువకుడికి హైదరాబాద్, మాసబ్‌ట్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకటేశ్వర నాయక్ రూ.2.5 లక్షల లంచం తీసుకున్నాడు. అనంతరం నకిలీ నియామక పత్రాన్ని ఇచ్చాడు. దీంతో ఆయన ఉద్యోగంలో చేరాడు.

అదే సమయంలో అతడి స్థానంలో పనిచేసే మహిళ ప్రసూతి సెలవులపై వెళ్లడంతో ఆమె జీతాన్ని తెలివిగా రణ్‌ధీర్ ఖాతాలో వేయించాడు. అయితే, ఇటీవల ఆమె మళ్లీ ఉద్యోగంలో చేరడంతో బండారం బయటపడింది. నాలుగు నెలలుగా తనకు వేతనం రాకపోవడంతో నాయక్‌ను కలిసి జీతం గురించి అడిగాడు. అతడికి సమాధానం చెప్పాల్సిన నాయక్ పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించాడు. అంతేకాక, మరో రూ.40 వేలు ఇస్తే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పిస్తానని ఆశ చూపించాడు. నాయక్ భయపెట్టడంతో రణ్‌ధీర్ తిరిగి హన్మకొండ వెళ్లిపోయాడు.

రెండు నెలల క్రితం నాయక్ భార్య లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న రణ్‌ధీర్ రెండు వారాల క్రితం హైదరాబాద్ వచ్చి ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వరరావును కలిసి జరిగిన మోసాన్ని వివరించాడు. నాయక్ తనకిచ్చిన నకిలీ నియామకపత్రంతో పాటు ఇతర ఆధారాలను ఆయనకు ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు నాయక్‌పై నిఘా ఉంచి శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మధ్యవర్తి కందుకూరి ప్రకాశ్‌కు కూడా అరదండాలు వేశారు. ఉత్తమ ఎమ్మార్వోగా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న లావణ్య, ఆమె భర్త రెండు నెలల వ్యవధిలోనే ఏసీబీకి చిక్కడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.

More Telugu News