Madhya Pradesh: ఈ పుస్తకాల పురుగు నాకొద్దు... ఎప్పుడూ చదువులో మునిగితేలుతున్న భర్తకు గుడ్ బై చెప్పిన భార్య!

  • యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న భర్త
  • తనను పట్టించుకోవడం లేదంటూ భార్య అసంతృప్తి
  • భర్త ప్రవర్తనతో విసిగిపోయి కోర్టును ఆశ్రయించిన ఇల్లాలు

మధ్యప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన ఉదంతం తెరపైకి వచ్చింది. అస్తమానం పుస్తకాలతో కుస్తీ పడుతున్న భర్తతో తాను కాపురం చేయలేనంటూ ఓ ఇల్లాలు కోర్టును ఆశ్రయించింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ ఉద్యోగం రాకముందే పెళ్లి చేసుకున్నాడు. అతను కొన్నాళ్లుగా యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కొత్తగా తన ఇంట అడుగుపెట్టిన భార్యను సైతం పట్టించుకోకుండా పుస్తకాలు ముందేసుకుని ప్రశ్నలు, జవాబులతో కుస్తీలు పట్టేవాడు.

అసలే కొత్త పెళ్లికూతురు... కోటి ఆశలతో కొత్త కాపురానికి వస్తే భర్త తనను పట్టించుకోకపోవడం ఆమె అహాన్ని దెబ్బతీసింది. తనను కేవలం అతని తల్లి బాగోగులు చూసే యంత్రంలా పరిగణించడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. దాంతో, అతడితో కాపురం చేయలేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనను భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. భార్య ఉందన్న విషయమే గుర్తులేనట్టుగా అతను ప్రవర్తిస్తుంటే తాను భరించలేకపోతున్నానని, తనకు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టును కోరింది.

ఆ యువకుడు కూడా ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, విడాకులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం. బంధుమిత్రులు ఎంత చెప్పినా ఇరువురి వైఖరిలో మార్పు లేకపోవడంతో, ఫ్యామిలీ కౌన్సిలర్లు రంగంలోకి దిగారు. తమ వంతు చెప్పి చూస్తామని, అప్పటికీ వినకుంటే కోర్టు నిర్ణయమే శిరోధార్యమని వారు పేర్కొన్నారు.

More Telugu News