Pakistan: భారత్ తో చర్చలకు సిద్ధమంటూ మళ్లీ శాంతి ప్రవచనాలు వల్లిస్తున్న పాక్

  • ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోయిన పాక్
  • అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టిన వైనం
  • మద్దతు కొరవడిన నేపథ్యంలో భారత్ తో చర్చలకు మొగ్గు

నిన్నటిదాకా యుద్ధం గురించి అదే పనిగా ప్రకటనలు గుప్పించిన పాకిస్థాన్ ఇప్పుడు మళ్లీ శాంతి గురించి మాట్లాడుతోంది. భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన దరిమిలా పాక్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ ను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలని భావించి తానే కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటోంది.

చైనా సహా ఏ ఒక్క దేశమూ పూర్తిస్థాయి భరోసా ఇవ్వకపోవడంతో పాక్ యుద్ధోన్మాదంతో రంకెలేసింది. అయితే ఆ ఆవేశం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. పాక్ అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నా సరే ఏ ఒక్క దేశమూ స్పందించకపోగా, భారత్ కూడా పాక్ కు అంత సీన్ లేదు అని బాహాటంగా ప్రకటించింది. దాంతో ఏమీ పాలుపోని దాయాది దేశం ఇప్పుడు కొత్తగా చర్చల బాణీ ఎత్తుకుంది. భారత్ తో షరతులతో కూడిన ద్వైపాక్షిక చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెబుతున్నారు.

భారత్ తో చర్చల విషయంలో పాకిస్థాన్ చింతించడంలేదని, చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. శాంతి చర్చలను పాకిస్థాన్ ఎప్పుడూ తిరస్కరించలేదని, కానీ భారత్ మాత్రం చర్చలకు సానుకూల సంకేతాలు పంపడంలేదని ఆరోపించారు.

More Telugu News